కృష్ణ 'గూఢచారి 116'తో హిందీ రీమేక్స్ మొదలుపెట్టిన జితేంద్ర!
on Jun 29, 2021
పలు తెలుగు సినిమాల హిందీ రీమేక్‌లలో జితేంద్ర హీరోగా నటించారు. వాటిలో 'హిమ్మత్‌వాలా' (ఊరికి మొనగాడు), షాదీ కే బాద్ (పెళ్లిచేసి చూడు), దుల్హన్ (శారద), దిల్‌దార్ (సోగ్గాడు), స్వర్గ్ నరక్ (స్వర్గం నరకం), నిషానా (వేటగాడు), ప్యాసా సావన్ (ఏడంతస్తుల మేడ), జానీ దోస్త్ (అడవి సింహాలు), తోఫా (దేవత) లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఈ ధోరణికి నాంది పలికింది కృష్ణ హీరోగా నటించిన మూడో సినిమా కావడం గమనార్హం. అది.. 1966లో వచ్చిన 'గూఢచారి 116'. ఆ సినిమాతోటే కృష్ణ ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పేరు పొందారు. మంగళగిరి మల్లికార్జునరావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో కృష్ణ సరసన జయలలిత నాయికగా నటించారు. సినారె రాసిన "ఎర్రాబుగ్గల మీద మనసుంది", "నువ్వు నా ముందుంటే నువ్వలా చూస్తుంటే" పాటలు, ఆరుద్ర రాసిన "మనసు తీరా నవ్వులు నవ్వాలి", "పడిలేచే కెరటం చూడు" పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. టి. చలపతిరావు సంగీతం సమకూర్చారు.
ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో నిర్మాత డూండీ దీన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నప్పుడు జితేంద్ర బాడీ లాంగ్వేజ్ గూఢచారి క్యారెక్టర్‌కు సరిపోతుందనిపించి, ఆయనను తీసుకున్నారు. 'ఫర్జ్' పేరుతో రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలుసా.. తెలుగులో పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన, తెలుగులో ట్రిక్ ఫొటోగ్రఫీకి ఖ్యాతి చేకూర్చిన రవికాంత్ నగాయిచ్! ఒరిజినల్‌కు ఆరుద్ర ఇచ్చిన కథ, స్క్రీన్‌ప్లేలను యథాతథంగా హిందీ వెర్షన్‌కు ఉపయోగించుకున్నారు. ఈ సినిమాలో నాయికగా కరిష్మా కపూర్, కరీనా కపూర్ తల్లి బబిత నటించారు. శోభన్‌బాబు చెల్లెలుగా నటించిన గీతాంజలి క్యారెక్టర్‌ను 'ఫర్జ్'లో కాంచన పోషించారు.
అలాగే ఒరిజినల్‌లో డైలాగ్స్ లేకుండా కనిపించే రాజనాల హిందీ వెర్షన్‌లోనూ అదే పాత్ర చేశారు. తెలుగు వెర్షన్ షూటింగ్‌ను ఏయే లొకేషన్లలో తీశారో, హిందీ వెర్షన్‌ను కూడా ఆ లొకేషన్లలోనే తీశారు. 1967 అక్టోబర్ 6న విడుదలైన 'ఫర్జ్' సూపర్ హిట్టయి, జితేంద్రకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కృష్ణ తెలుగులో చేసిన పలు సినిమాల హిందీ రీమేక్స్‌లో జితేంద్ర హీరోగా నటించారు. కేవలం కృష్ణ సినిమాలే కాకుండా 'పాతాళ భైరవి', 'ఖైదీ' లాంటి సినిమాల రీమేక్స్‌లోనూ నటించిన జితేంద్ర రీమేక్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
